“మైదానం కావాలి… మన్నించండి సార్”

On: January 2, 2026 4:40 PM

“మైదానం కావాలి… మన్నించండి సార్”

గ్రామ క్రీడా మైదానం కోసం గ్రామస్తుల వేడుకోలు

 జిల్లా కలెక్టర్‌కు కన్నాయిగూడెం గ్రామస్తుల వినతి

కన్నాయిగూడెం, జనవరి 2, (తెలంగాణ జ్యోతి) : గ్రామానికి ఊపిరి లాంటిది, పిల్లల భవిష్యత్తుకు పునాది అయిన క్రీడా మైదానాన్ని కబ్జా చేస్తూ పంచాయతీ భవన నిర్మాణం చేపట్టడంపై లక్ష్మీపురం, దేవాదుల గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పిల్లలు, యువత ఆడుకునేందుకు ఒక్కటే మైదానం ఉందని, అదే ఇప్పుడు కాంక్రీట్ నిర్మాణాల కింద మట్టిలో కలిసిపోతున్నదని వారు ఆందోళన చెందుతున్నారు. “కలెక్టర్ సార్… మీరు జిల్లాకు పెద్దమనిషి… మా గ్రామం గోడు మీ చెవుల దాకా రాకపోతుందా?” అంటూ కన్నీళ్లతో ప్రశ్నిస్తూ, పంచాయతీ భవనం అవసరమే అయినా దానికి ఆటస్థలాన్నే ఎందుకు ఎంచుకున్నారో చెప్పాలని నిలదీస్తున్నారు. గ్రామంలో ఇతర ఖాళీ స్థలాలు ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా క్రీడా మైదానాన్నే ఎంపిక చేయడం అన్యాయమని, అభివృద్ధి అంటే భవనాలే కాకుండా భవిష్యత్తు తరాలకు అవసరమైన ఆటస్థలాలు, ఓపెన్ స్పేస్‌లను కాపాడడమూ ముఖ్యమని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే పత్రికల్లో కథనాలు, ఫోటోలు వెలువడినా అధికారులు స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “పత్రికల్లో రాసిండ్రు… ఫోటోలు వేసిండ్రు… అయినా అధికారులు ఎందుకు కన్ను మూసుకున్నారు?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “మా పిల్లలు రేపటి పౌరులు; వాళ్లకు ఆడుకునే మైదానం ఉండాలన్నా అది కూడా తప్పా? అభివృద్ధి పేరుతో మా పిల్లల భవిష్యత్తునే కూల్చేస్తారా?” అంటూ గ్రామ యువత ప్రశ్నిస్తోంది. క్రీడల ద్వారా ఆరోగ్యం, క్రమశిక్షణ, ఐక్యత పెరుగుతాయని, అలాంటి మైదానాన్ని నాశనం చేయడం గ్రామాభివృద్ధికి విరుద్ధమని చెబుతూ, జిల్లా కలెక్టర్ స్వయంగా గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించి ఈ అన్యాయానికి తక్షణమే చెక్ పెట్టాలని గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!