రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలి
KVPS జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్ పిలుపు
ములుగు, జనవరి 7 (తెలంగాణ జ్యోతి): రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని KVPS జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్ పిలుపునిచ్చారు. ములుగు జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన స్వయంగా రక్తదానం చేసి మాట్లాడుతూ, ఒకరి రక్తదానం మరొక ముగ్గురికి ప్రాణదానంగా మారుతుందని పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు వరకు రక్తదానం చేయవచ్చని, పురుషులు మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేసే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలో రక్త నిల్వలు తీవ్రంగా తగ్గిపోవడంతో పేద ప్రజలు, మహిళలు, అనారోగ్య బాధితులు రక్తం కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రక్తదానం వల్ల అనారోగ్యం వస్తుందనే అపోహలను వీడాలని, డబ్బులతో కాకుండా మన రక్తంతోనే సాటి మనుషుల ప్రాణాలు కాపాడే అవకాశం ప్రతి ఒక్కరికీ ఉందని అన్నారు. ములుగు ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకులో ఎవరైనా, ఎప్పుడైనా వచ్చి రక్తదానం చేయవచ్చని, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రక్తదాతలు వీరాస్వామి, రాజు, ప్రకాష్, చంటి తదితరులతో పాటు మొత్తం 20 మంది పాల్గొన్నారు.





