పంచాయితీల్లో అవినీతి రహిత పాలన అందించాలి
– రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
కాటారం, డిసెంబర్ 24 (తెలంగాణ జ్యోతి): నూతనంగా ఎన్నికైన సర్పంచులు పంచాయితీల్లో అవినీతి రహిత పాలన అందించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. కాటారం, మహాదేవపూర్, మలహర్, మహాముత్తారం, పలిమెల మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఉపసర్పంచులకు బుధవారం కాటారం పట్టణంలో నిర్వహించిన అభినందన–సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో ఉన్న మౌలిక సమస్యలను గుర్తించి పరిష్కరించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చూడాలని సూచించారు. గ్రామాభివృద్ధిలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని, బడుగు బలహీన వర్గాలు, రైతులు, మైనార్టీలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాల అమలుకు కృషి చేయాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మోసం చేసే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. జనవరి రెండో వారంలో కాటారం సబ్ డివిజన్లో గెలిచిన కాంగ్రెస్ వార్డు సభ్యులందరికీ అభినందన సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి
నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారిని ఉపేక్షించబోమని, నిబద్ధతతో పనిచేసే వారికే తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు అధైర్యపడవద్దని, భవిష్యత్తులో వారికి అవకాశాలు ఉంటాయని భరోసా ఇచ్చారు. అనంతరం మహాదేవపూర్‌లోని శ్రీ నాగేంద్రగిరి అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అలాగే మహాదేవపూర్‌లో సర్పంచ్‌గా ఓడిపోయిన మాజీ జెడ్పిటిసి గుడాల అరుణ శ్రీనివాస్ నివాసానికి వెళ్లి పరామర్శించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడింగ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్ రెడ్డి, ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, ఆలయ కమిటీ చైర్మన్ పడకంటి రమేష్, సర్పంచ్ హసీనా భాను, జిల్లా కాంగ్రెస్ నాయకులు వి. వంశవర్ధన్ రావు, గద్దె సమ్మిరెడ్డి, నవీన్ రావు, తెప్పెల దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





