నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
– జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
అంకిత భావంతో పని చేయాలి
– జిల్లా ఎస్పి కిరణ్ ఖరే
తెలంగాణ జ్యోతి , కాటారం : నిరుద్యోగ యువతకు ఉపాధికల్పనే లక్ష్యంగా మెగా జాబ్ మేళాను నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. సోమవారం కాటారం మండలం, బి, ఎల్ ,ఎం గార్డెన్స్ లో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మంచి పేరుగాంచిన 65 కు పైగా పరిశ్రమల్లో 6 వేల ఉద్యోగ అవకాశాలున్నాయని. యువత ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. జీరో నుండి అన్ని విద్యార్హతలున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు. మారుమూల ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పనకు వివిధ కంపెనీలు ముందుకు రావడం చాలా సంతోషమని చెప్పారు. ఉన్నత చదువులు చదివి ఉన్న యువతకు ఇదొక చక్కటి అవకాశం అని చెప్పారు. ఇటీవల వైద్యశాఖలో 27 పోస్టులు భర్తీకి చర్యలు చేపడితే దాదాపు 500 మందికి పైగా నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకున్నారని, ప్రభుత్వ రంగంలో లిమిటెడ్ పోస్టులు ఉంటాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రంలో ఉపాధి కొరకు వస్తున్నారని. మన యువత వరంగల్, హైదరాబాదు పట్టణాలకు వెళ్లి ఉపాధి పొందాలని చెప్పారు. భారతదేశంలోని అతి పెద్ద కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని, యువత ఆసక్తి చూపాలని మెల్ల, మెల్లగా వేతనాలు పెరుగుతాయని, ప్రారంభంలో ఏ స్థాయి ఉద్యోగికైనా తక్కువ వేతనం వస్తుందని నిరాశ చెందకుండ ఉండాలని చెప్పారు. తన తండ్రి 500 రూపాయలకు ప్రైవేట్ కంపెనీలో విధులు నిర్వహించారని క్రమేణా వేతనం పెరుగుతూ వచ్చినట్లు చెప్పారు. కష్టపడి వృత్తి పట్ల నిబద్దత, అంకితభావంతో పని చేస్తే వేతనం పెరగడంతో పాటు గుర్తింపు వస్తుందని, తద్వారా తల్లిదండ్రు లపై ఆధారపకుండా మన కాళ్లపై మనం నిలబడటానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. తాను ఒకటిన్నర సంవత్సరాల పాటు ప్రైవేట్ సంస్థలో ఉద్యోగ విధులు నిర్వహించానని, తల్లిదండ్రులపై ఆధారపడకుండా సొంతంగా వచ్చిన వేతనంతో సివిల్ సర్వీసెస్ కు సన్నద్ధ మయ్యానని చెప్పారు. మనం ఉన్న ప్రాంతంలోనే ఉపాధి కల్పన జరగాలంటే కష్టమని ఉపాధి అవకాశాలు లభించే చోటుకు మనం వెళ్లి సద్వినియోగం చేసుకొవాలనితాను డిల్లీ నుండి, జిల్లా ఎస్పి మహారాష్ట్ర నుండి వచ్చి ఇక్కడ పనిచేస్తు న్నామని అలానే యువత ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే ఎలాంటి సందేహం లేకుండా నిరభ్యంతంగా వెళ్లాలని సూచించారు. జిల్లా ఎస్పీ కిరణ్ ఖరె మాట్లాడుతూ మారు మూల ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పనకు మెగా జాబ్ మేళా నిర్వహించడం చాలా సంతోషమని చెప్పారు. యువత కెరీర్ ని మంచిగా మలుచు కోవాలని, తద్వారా తల్లిదండ్రులకు, మన జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆయన సూచించారు. అనంతరం ఉద్యోగ నియామక పత్రాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సంజీవరావు, యంపిపి పంతకాని సమ్మయ్య, తహసిల్దార్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.