దుబ్బపెల్లి వద్ద రెండు బైకులు ఢీ: ఇద్దరు మృతి
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి:జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండలం దామరకుంట గ్రామ సమీపం లోని దుబ్బపెల్లి వద్ద ఎదురు ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారంగా… దామరకుంట ఆయుష్ దావఖానలో పనిచేస్తున్న అటెండర్ కాపరబోయిన రాజయ్య తో పాటు అదే గ్రామానికి చెందిన ఐలాపురం బాపు ఇద్దరు వ్యక్తులు కలిసి మోటార్ సైకిల్ పై దామరకుంట నుంచి విలాసాగర్ కు వస్తుండగా దుబ్బపెల్లి సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. రాజయ్య బాపులు ఉన్న మోటార్ బైకునకు ఎదురుగా విలాసాగర్ నుంచి దామరకుంట వైపు మలహార్ మండలం రుద్రారం కు చెందిన ఇద్దరు వ్యక్తులు వెళుతున్న పల్సర్ బైకు ఢీ కొట్టింది. దీంతో వాహనం నడుపుతున్న దామరకుంటకు చెందిన రాజయ్య ఎగిరి కింద పడడంతో అటుగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ రాజయ్య తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడని స్థానికులు తెలిపారు. అలాగే తీవ్ర గాయాల పాలైన బాపును జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృత్యువాత పడ్డట్లు వారు తెలిపారు. పల్సర్ బైక్ నడుపుతున్న వాహన చోదకునికి కూడా గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణ మైన ఇసుక ట్రాక్టర్ విలాసాగర్ కు చెందినదిగా భావిస్తు న్నారు. ఆ సమయంలో ట్రాక్టర్ ను నడుపుతున్నది మైనర్ అని సమాచారం. ఇదిలా ఉండగా దామరకుంట, గంగారం, విలాసాగర్ గ్రామాల మధ్య ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో ట్రాక్టర్లు మితిమీరిన అతివేగంతో రాకపోకలు సాగిస్తున్నాయని, అలాగే శిక్షణ , ధృవీకరణ పత్రాలు లేని వారు, మైనర్లు సైతం ట్రాక్టర్లను, ఇతర వాహనాలను నడపడం వల్లనే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని, సంఘటన జరిగిన ప్రదేశంలోని పలువురు బాహటంగానే పేర్కొన్నారు. సంఘటన స్థలాన్ని కాటారం ఎస్ ఐ మ్యాక అభినవ్ సందర్శించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.