ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ తరగతులు
ఎన్నికల నిబంధనల అమలులో జాగ్రత్తలు వహించాలి.
వెంకటాపురం నూగూరు, డిసెంబర్ 9, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధి గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రిసైడింగ్ అధికారులకు మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో అనుసరించాల్సిన నియమ నిబంధనలు, పోలింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బూత్ ఏర్పాటు విధానం, ఈవీఎంల వినియోగం, ఓటర్ల క్యూలైన్ నిర్వహణ వంటి అంశాలపై విపులంగా శిక్షణ ఇచ్చారు. మండలంలోని 18 గ్రామపంచాయతీలలో ఈ నెల 17వ తేదీన ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మొత్తం 166 పోలింగ్ కేంద్రాలకు ప్రిసైడింగ్ అధికారులను నియమించినట్లు అధికారులు తెలిపారు. అదనంగా 34 మందిని రిజర్వ్‌గా సిద్ధం ఉంచినట్లు పేర్కొన్నారు. పోలింగ్ బూత్‌లలో విధులు నిర్వహించే అధికారులు ఈ నెల 15, 16 తేదీల్లో తప్పనిసరిగా హాజరై రిపోర్ట్ చేయాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు తెలియజేశారు. ములుగు జిల్లాలోని వివిధ మండలాల నుండి నియమితులైన ప్రిసైడింగ్ అధికారులు ఒక్కరోజు శిక్షణ తరగతుల్లో పాల్గొని ఎన్నికల నిర్వహణపై అవగాహన పొందారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని స్పెషల్ ఆఫీసర్ సంజీవరావు, ఎంపీడీవో రాజేంద్ర ప్రసాద్, మండల తాసిల్దార్ వేణుగోపాల్, మండల విద్యాధికారి సత్యనారాయణ తదితర అధికారులు పర్యవేక్షిస్తూ, పాల్గొన్న అధికారులకు సూచనలు అందించారు.






