గట్టమ్మ ఆలయం వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి
నూతన పార్కింగ్‌తో భక్తులకు మరింత సౌకర్యం: మంత్రి సీతక్క
ములుగు, డిసెంబర్31, తెలంగాణ జ్యోతి : జిల్లా కేంద్ర సమీపంలోని గట్టమ్మ గుట్ట వద్ద నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్‌ఓబి) పనులను త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదేశించారు. బుధవారం గట్టమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఆర్టీసీ బస్సులు–ప్రైవేట్ వాహనాల పార్కింగ్ ఏర్పాట్లను మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర, ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్, డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జాదవ్‌లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ—జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే భక్తులు, పర్యాటకులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకుని ముందుకు సాగుతారని పేర్కొన్నారు. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఆలయం వద్ద భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చాలని సూచించారు. నూతనంగా నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు వేగంగా పూర్తిచేయాలని, పార్కింగ్ నుంచి ఆలయ మార్గం వరకు ట్రాఫిక్ నియంత్రణతో వాహనాల సాఫీగా రాకపోకలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే పార్కింగ్ ప్రాంతంలో స్పష్టమైన రేడియం స్టిక్కర్లు, దిశానిర్దేశక సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని, రాత్రి వేళల్లో కూడా స్పష్టంగా కనిపించేలా సూచికలు అమర్చాలని తెలిపారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, నూతన పార్కింగ్ ఏర్పాట్లతో భక్తులు సురక్షితంగా, సౌకర్యంగా ఆలయాన్ని సందర్శించే అవకాశం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, ఆర్‌అండ్‌బి శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.







