వైభవంగా వల్లి–దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుల కళ్యాణం
– తరలివచ్చిన అశేష భక్తజనం
వెంకటాపురం, నవంబర్ 26,తెలంగాణ జ్యోతి : శ్రీ సుబ్రహ్మణ్య షష్టి పర్వదినం సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లోని అనేక ఆలయాల్లో వేకువజాము నుంచే భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలకు బారులుదీరారు. పెద్ద సంఖ్యలో భక్తులు చేరడంతో ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. వెంకటాపురం మండల కేంద్రంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుల వారికి ప్రత్యేక పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం వల్లి–దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుల దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య, భక్తి శ్రద్ధలతో కళ్యాణ మండపంలో నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామివారి నిరాజనాల మధ్య జరిగిన ఈ కళ్యాణోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరై భక్తిరసానందాన్ని పొందారు. కళ్యాణ క్రతువును అర్చకులు అవసరాల రామశర్మ శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. అలాగే మండల కేంద్రంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రతిరోజు జరిగే పూజా కార్యక్రమాలతో పాటు బుధవారం రాత్రి ‘పడిపూజ’ను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు ఆలయ కమిటీ వెల్లడించింది. పడిపూజ అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేసారు.






