ఆదివాసి హక్కుల కోసం పోరాటం అవసరం
పూనం రామచంద్రరావు
వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 18, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని తెలంగాణ భూమిపుత్ర ఆదివాసి సంఘం కార్యాలయంలో శనివారం రెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టిబిఏఎస్ రాష్ట్ర అధ్యక్షులు పూనం రామ చంద్రరావు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసులకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కులు, చట్టాలను అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ 3 స్థానంలో కొత్త జీవో తీసుకువచ్చి ఆదివాసి నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. 1/59, 1/70 చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరారు. గిరిజనేతరుల వలసలను అరికట్టాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వీరభద్రవరం, అబ్బాయిగూడెం, యాకన్నగూడెం, లక్ష్మీనగరం గ్రామాల నుంచి 30 మందికి పైగా యువత, మహిళలు సంఘంలో చేరినట్లు తెలిపారు. ఆదివాసి హక్కుల రక్షణ కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తుడుం దెబ్బ జిల్లా నాయకులు, టీబీఏఎస్ జిల్లా కన్వీనర్ పూనం మనేశ్వరరావు, వాసం లక్ష్మయ్య, గొంది శేషగిరి, జజ్జరి నారాయణమ్మ, ఇరుప లక్ష్మి, పొడెం రాజేష్, తాటి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.









