ములుగు జిల్లాలో సంక్రాంతి పండుగ సందడి
ములుగు, జనవరి 15 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామగ్రామాన పండుగ వాతావరణం వెల్లివిరిసింది. భోగి మంటలతో పండుగ శుభారంభం కాగా, ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండి వంటల సువాసనతో ఊళ్లు కళకళలాడాయి. మహిళలు ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనగా, యువత గ్రామీణ క్రీడలతో సందడి చేశారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల కలయికతో ఇళ్లలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, గ్రామాల్లో సంప్రదాయ కార్యక్రమాలతో సంక్రాంతి వేడుకలు భక్తి, సంస్కృతి పరిమళంతో ఘనంగా కొనసాగాయి.






