Mulugu sp | పోలీస్ అమరవీరులు చేసిన త్యాగాలు మరువలేనివి
-అమరుల స్ఫూర్తిగా స్మృతి పరేడ్ నిర్వహన: జిల్లా ఎస్పీ శ్రీ గౌష్ ఆలం
ములుగు ప్రతినిధి : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐ పి ఎస్ అమరవీరుల కుటుంబాలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించి ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. విధులు నిర్వహిస్తూ అనేక సందర్భాలలో అమరులయిన పోలీసు వీరుల త్యాగాలను గుర్తు చేస్తూ జిల్లా ఎస్ పి గౌష్ ఆలం ఐ పి ఎస్, ఓ ఎస్ డి అశోక్ కుమార్ ఐ పి ఎస్, ఏ ఎస్ పి ఏటూరునాగారం సిరిశెట్టి సంకీర్త్ ఐ పి ఎస్ పోలీస్ అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి గౌరవ వందనంగా సెల్యూట్ చేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీసుల జీవితాలనే మనం మార్గదర్శకంగా తీసుకోవాలని, పోలీసు జీవితం ముళ్ళ మీద నడక వంటిదని అవిశ్రాంతంగా ప్రజల ధన మాన ప్రాణాలకోసం నిరంతరం పనిచేయవలసి ఉంటుందన్నారు. అందుకు కుటుంబానికి సైతం దూరంగా ఉండడం జరుగుతుందని తెలియచేస్తూ అమరులైన పోలీస్ వీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అమరవీరుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం తనకార్యాలయం లో వారితో కలిసి ముచ్చటిస్తూ వారి సమస్యల పట్ల వెంటనే స్పందించి పోలీస్ శాఖ ద్వారా వారికి రానున్న ప్రతి బెనిఫిట్ త్వరితగతిన అందేలా స్వయంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. జిల్లా ఎస్పీ అమరులైన ప్రతి కుటుంబానికి మైక్రో ఓవెన్ బహుమతిగా అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్ పి సదానందం, డి ఎస్ పి రవీందర్, ఎస్ బి ఇన్స్పెక్టర్ కిరణ్, సి సి ఎస్ ఇన్స్పెక్టర్ దయాకర్, సి ఐ ములుగు రంజిత్ కుమార్, సి ఐ పస్రా శంకర్, ఆర్ ఐ అడ్మిన్ సతీష్, ఆర్ ఐ సంతోష్, ఆర్ ఐ వెంకటనారాయణ, ఎస్ ఐ ములుగు వెంకటేశ్వర్, ఎస్ ఐ తాడ్వాయి ఓంకార్, ఎస్ ఐ డి సి ఆర్ బి కమలాకర్, ఎస్ ఐ మధులిక తదితర సిబ్బంది పాల్గొన్నారు.