ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న పోరుదీక్షను విజయవంతం చేయాలి
ములుగు, జనవరి 19 (తెలంగాణ జ్యోతి): ఈ నెల 20న హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద ఈ నెల 20న నిర్వహించనున్న కళాకారుల పోరుదీక్షను జయప్రదం చేయాలని తెలంగాణ నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర సాంస్కృతిక విభాగం ఇంచార్జ్ మోతె రమేష్ పిలుపునిచ్చారు. ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కరపత్రాలు ఆవిష్కరిస్తూ మాట్లాడిన మోతె రమేష్, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆటపాటలతో ప్రజలను చైతన్యం చేసిన నిరుద్యోగ కళాకారులకు గత పాలకులు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలన వచ్చిన తర్వాత నిరుద్యోగ కళాకారులకు న్యాయం చేస్తామని, సాంస్కృతిక సారధిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలుకాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తయినా కళాకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ కవులు, కళాకారులు అందరూ ఏకమై వెయ్యి మందితో ఇందిరాపార్క్ వద్ద పోరుదీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా సాంస్కృతిక సారధిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా జేఏసీ ప్రజాసంఘాల నాయకులు మంజల బిక్షపతి, జిల్లా కళాకారుల ఇంచార్జ్ పత్తిపల్లి రాజేందర్, ఉపాధ్యక్షులు బత్తుల ఉపేందర్, నేదురి స్రవంతి, మల్లేష్ యాదవ్, మల్లయ్య, బద్రి, నవీన్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.






