నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి.
– జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
కాటారం, డిసెంబర్30, తెలంగాణ జ్యోతి : జిల్లావ్యాప్తంగా 31 డిసెంబర్ రాత్రి మరియు నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించుకునే వేడుకలను శాంతియుతంగా, నిబంధనలకు లోబడి జరుపుకోవాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ప్రజలకు సూచించారు. ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బాధ్యతాయుతంగా వేడుకలు నిర్వహించాలని ఒక ప్రకటనలో తెలిపారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా శాంతి–భద్రతలకు భంగం కలగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా, భూపాలపల్లి జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.రాంగ్ సైడ్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్, స్పీడ్ రేసింగ్, ట్రిపుల్ రైడింగ్ వంటి చర్యలు చట్టవిరుద్ధమని, వీటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడిపితే, వారిపై మాత్రమే కాకుండా వారి తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేయబడతాయని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. పోలీస్ అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఈవెంట్లు, బహిరంగ కార్యక్రమాలు నిర్వహించరాదని, జిల్లావ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని గుర్తు చేశారు. ప్రైవేట్ ఈవెంట్లు నిర్వహించదలచిన వారు తప్పనిసరిగా పోలీస్ మరియు ఎక్సైజ్ శాఖల అనుమతులు పొందాలని సూచించారు.రోడ్లపై కేక్ కటింగ్‌లు చేయడం, టపాకాయలు వెలిగించడం, బైక్ రేసింగ్‌లు నిర్వహించడం చట్టప్రకారం నేరమని తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇళ్ల వద్ద లేదా ఇతర ప్రదేశాల్లో స్పీకర్లు, సౌండ్ బాక్సులు, మైక్ సిస్టమ్‌లు ఏర్పాటు చేయాలంటే పోలీస్ అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేశారు. జిల్లా లోని ప్రతి మండల పరిధిలో ఒకే నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు. యువత నిబంధనలను పాటిస్తూ, బాధ్యతా యుతంగా నూతన సంవత్సర వేడుకలను జరుపుకుని, పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు.






