పర్యాటకులకు భూతల స్వర్గధామంగా ములుగు జిల్లా ప్రకృతి అందాలు
భక్తి – ఆనందం – ఆహ్లాదం తో పాటు చారిత్రాత్మక నేపథ్యం కలిగిన పర్యాటక ప్రదేశాలు
పర్యాటకులకు సాదర ఆహ్వానం పలుకుతున్నాం : మంత్రి సీతక్క
ములుగు ప్రతినిధి, డిసెంబర్ 31, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా పర్యాటకులకు భూతల స్వర్గధామంగా నిలుస్తోందని, సహజ సిద్ధ ప్రకృతి అందాలు, భక్తి–ఆనందం–ఆహ్లాదంతో పాటు చారిత్రాత్మక నేపథ్యం కలిగిన పర్యాటక ప్రదేశాలు ఇక్కడ నెలవై ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. బుధవారం తాడ్వాయి మండల కేంద్రంలో ఎకో టూరిజం ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ పరిధిలోని తాడ్వాయి వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ రేంజ్‌లో తాడ్వాయి హాట్స్‌తో పాటు రెండు సఫారీ వాహనాలను జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జాదవ్‌లతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా తాడ్వాయి హాట్స్ ఆవరణలోని వివిధ అరుదైన వృక్షజాతుల వివరాలు, వాటి ప్రయోజనాలను మంత్రి సీతక్కకు డీఎఫ్‌వో వివరించారు. అనంతరం మంత్రి సీతక్క ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సుమారు 7 కిలోమీటర్ల మేర సఫారీ పర్యటన చేశారు. రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఆదేశాల మేరకు తాడ్వాయి హాట్స్‌ను ఆధునీకరించి సుందరీకరించడంతో పాటు జాతీయ రహదారి పక్కన 6 హాట్స్‌ను, 18 కిలోమీటర్ల సఫారీకి రెండు వాహనాలను ప్రారంభించామని మంత్రి తెలిపారు. ములుగు జిల్లా పేరు చెప్పగానే భక్తి, ఆనందం, చరిత్ర కలగలిసిన పర్యాటక ప్రాంతాలు గుర్తుకొస్తాయని, ఘట్టమ్మ తల్లి దర్శనం ఆనవాయితీగా కొనసాగుతుందని, ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకుంటోందని, రామప్ప సరస్సు మధ్య ద్వీపకల్ప అభివృద్ధి పనులు త్వరలో పూర్తిచేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. కాకతీయులు నిర్మించిన లక్నవరం సరస్సు, ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన శ్రీ మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు రూ.251 కోట్లతో ఆలయ అభివృద్ధి, బ్లాక్ బెర్రీ ఐలాండ్ పునఃప్రారంభం, నైట్ క్యాంపింగ్ సదుపాయాలు, మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, తెలంగాణ నయాగరా బొగత జలపాతం వంటి ఆకర్షణలు ములుగు జిల్లాను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని అన్నారు. హైదరాబాద్‌కు సుమారు 250 కిలోమీటర్లు, హనుమకొండకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగు జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించి స్వచ్ఛమైన గాలి, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలని పర్యాటకులు, భక్తులకు మంత్రి సాదర ఆహ్వానం పలికారు.








