ఆదర్శలో అలరించిన జాతీయ రైతు దినోత్సవ వేడుకలు
– 50 మంది రైతులకు ఘన సన్మానం : ఆకట్టుకున్న ఆదర్శ ఆగ్రి ఎక్స్ పో
కాటారం, డిసెంబర్ 23, తెలంగాణ జ్యోతి : కాటారం మండల కేంద్రం లోని ఆదర్శ హైస్కూల్ లో మంగళవారం జాతీయ రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దివంగత ప్రధాని చౌదరి చరణ్ సింగ్ చితపటానికి నివాళులు అర్పించారు. వివిధ గ్రామాల్లోని 50మంది రైతులను సాదరంగా స్వాగతించి అన్నదాతల జౌన్నత్యాన్ని చాటి చెపుతూ రైతుల పట్ల సమాజంలో గౌరవం నింపేలా వారిని ఘనంగా శాలువాలతో సన్మానించారు. రైతులతో విద్యార్థులకు వ్యవసాయం పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులు పంటలు సాగు చేసే విధానం, ఎదుర్కొనే సమస్యలు, రైతులకు సమాజంలో ఇవ్వాల్సిన గౌరవం, గుర్తింపు పట్ల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆలోచింపజేశాయి. విద్యార్థులే రైతులుగా మారి పంట సాగు మొదలు నుంచి మార్కెట్ కు పంటను తీసుకెళ్లే వరకు అన్నదాతలు పడే కష్టాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ పంట ఉత్పత్తులు, కూరగాయలు, మార్కెట్లో విక్రయించే పద్ధతులపై విద్యార్థులు ప్రత్యేక వ్యవసాయ ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఆదర్శ అగ్రి ఎక్స్ పో పేరిట రైతులకు అవసరమయ్యే ఆధునిక పనిముట్లు, వినూత్న పంటల సాగు, అధునిక వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయంలో అవలంబించే సాంకేతికతను వివరిస్తూ ప్రదర్శించారు. రైతుల జీవితాన్ని, పండించిన పంటల మహత్యాన్ని వివరిస్తూ విద్యార్థులు రూపొందించిన కళా ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ జనగామ కరుణాకర్ రావు మాట్లాడుతూ రైతులు దేశానికి వెన్నెముకని, అన్నం పెట్టే రైతన్నలను గౌరవించి ప్రోత్సహించేందుకే రైతులను సన్మానించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ జనగామ కార్తీక్ రావు, ప్రిన్సిపాల్ కృషిత, రైతులు రాజయ్య, నర్సింహులు, శేఖర్, పోచిరెడ్డి, టీ.రాజు, శంకర్, కిష్టయ్య, జనార్దన్, పీ.రాజు, చంద్రయ్య, రమేష్, సుధాకర్, దేవేందర్, బాపు తదితరులు పాల్గొన్నారు.






