వరి ధాన్యం ఖల్లాలు గా మారిన పాఖాల ప్రధాన రహదారి
– రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారిన అశోక్ నగర్
– ప్రమాదాలు జరిగితే తప్ప ముందస్తుగా అధికారులు పట్టించుకోరా?
– హడలెత్తిపోతున్న వాహనదారులు
తెలంగాణ జ్యోతి, ఖానాపూర్ : వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామానికి చెందిన రైతులు పాకాల ప్రధాన రహదారిని వరి ధాన్యం కల్లాలుగా మార్చారు. తమ పంట పొలాల్లో పండించిన వరి ధాన్యాన్ని యంత్రాల సహాయంతో నూర్పిడి చేసిన ధాన్యాన్ని రైతన్నలు కొనుగోలు కేంద్రానికి తరలిస్తే దాన్యంలో అధిక తేమ ఉంది కొనుగోలు చేయలేమని తిరస్కరించారు. ధాన్యాన్ని ఆర పోయటానికి ఏకంగా పాఖాల ప్రధాన రహదారిని ఖల్లాలుగా ఎంచుకొని ఇరు వైపులా ధాన్యం కుప్పలు భారీగా పోయటంతో వాహనాల రాకపోకలతో నిత్యం రద్దిగా ఉండే ఈ రహదారి ఒక్కసారిగా రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. గత రెండు రోజుల క్రితం తమ ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి వాహనానికి హఠాత్తుగా గేదె అడ్డు రావటంతో ప్రమాదానికి గురై ఆపస్మారక స్థితికి చేరుకొగా అదే రైతులు 108 సహాయంతో నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మరువక ముందే ఇదే గ్రామానికి చెందిన ఓ రైతు ద్విచక్ర వాహానికి గుద్దుకొని తలకు తీవ్ర గాయలతో ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు. ప్రస్తుతం హన్మకొండ పట్టణంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్ప్పటికైనా పోలీస్ యంత్రాంగం, అధికారులు రహదారిని పరిశీలించి రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారిన వరి దాన్యం కుప్పలను తొలగించి వాహన దారులకు ఇబ్బందుల కలుగకుండా తగు చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.