డివైఎఫ్‌ఐ , ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ప్రారంభమైన కబడ్డీ పోటీలు
ములుగు, జనవరి 10 (తెలంగాణ జ్యోతి): డివైఎఫ్‌ఐ & ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ములుగు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. యువత ఆరోగ్యం, క్రీడా ఉత్సాహం మరియు సంప్రదాయాల సమ్మేళనంగా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపు కోవాలనే లక్ష్యంతో డివైఎఫ్‌ఐ & ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు డివైఎఫ్‌ఐ ములుగు జిల్లా అధ్యక్షుడు కలువల రవీందర్ తెలిపారు. ఈ పోటీలను ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్, ములుగు ఎస్సై బి. చంద్రశేఖర్, సీఐటీయూ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నం రాజేందర్ సంయుక్తంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో వారు మాట్లాడుతూ యువతను క్రీడల వైపు ఆకర్షించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, సంప్రదా య క్రీడలైన కబడ్డీని భవిష్యత్ తరాలకు అందించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉత్సాహాన్ని నింపుతాయని, యువతలో ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. ఈ పోటీల ద్వారా ప్రతిభావంతమైన క్రీడాకారులను గుర్తించి మరింత ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. డివైఎఫ్‌ఐ,ఎస్‌ఎఫ్‌ఐ యువత సంక్షేమం, విద్య, ఉపాధి, క్రీడల అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నాయని గుర్తు చేశారు. జిల్లా వ్యాప్తంగా కర్లపల్లి, గోవిందరావుపేట, జీవంతరావుపల్లి, బూరుగుపేట, తాడ్వాయి, ములుగు, మల్లంపల్లి, అసోసియేషన్ టీం తదితర గ్రామాలు, మండలాల నుంచి అనేక జట్లు పాల్గొనగా పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు చింతరాజు, భరత్, ధీకొండ భరత్, సాదు రాకేష్, మోరే లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.








