మేడారం తొలిఘట్టం గ్రాండ్ సక్సెస్

On: January 19, 2026 2:43 PM

మేడారం తొలిఘట్టం గ్రాండ్ సక్సెస్

మేడారం తొలిఘట్టం గ్రాండ్ సక్సెస్

– గద్దెల పునఃప్రారంభం అద్వితీయం

– వనదేవతలకు సీఎం కుటుంబం తొలి మొక్కులు

– 28 నుంచి 31 వరకు నిండుపున్నమి మహాజాతరకు తరలిరండి

– విలేకరుల సమావేశంలో రాష్ట్ర మంత్రి సీతక్క

ములుగు, జనవరి19, (తెలంగాణ జ్యోతి) : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో తొలి ఘట్టం ఘనవిజయంగా ముగిసిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) స్పష్టం చేశారు. సోమవారం మేడారంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈసారి గుడి పునరుద్ధరణ పనులు, గద్దెల పునఃప్రారంభం, సాంస్కృతిక కార్యక్రమాలు, భద్రతా ఏర్పాట్లు సమన్వయంతో సాగి అద్వితీయంగా నిలిచాయని తెలిపారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కుటుంబంతో కలిసి తొలి మొక్కులు చెల్లించడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలోనే క్యాబినెట్ నిర్వహించి, మంత్రులు, సీఎస్, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఉన్నతాధికారులతో కలిసి బస చేయడం ముఖ్యమంత్రి తీసుకున్న సాహసోపేత నిర్ణయమని ప్రశంసించారు. సీఎం మంత్రులతో కలిసి అమ్మవార్ల పైలాన్ ఆవిష్కరించి మొక్కులు చెల్లించుకొని తులాభారం సమర్పించారన్నారు.

– అధికారులు, మీడియా సేవలు ప్రశంసనీయం

 ఈ మొత్తం కార్యక్రమాల్లో కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీలు సుధీర్ రాంనాథ్ కేకన్, సిరిశెట్టి సంకీర్త్, కమిషనర్ గౌష్ ఆలం లతోపాటు జిల్లా పోలీస్, రెవెన్యూ యంత్రాంగం, హోంగార్డులు, అటెండర్ స్థాయి నుంచి ఐఏఎస్ వరకు సిబ్బంది, మహిళలు, వాలంటీర్లు అద్భుతంగా పనిచేశారని కృతజ్ఞతలు తెలిపారు. మీడియా సోదరులు అణువణువునా ప్రజలకు సమాచారాన్ని చేరవేసి లక్షలాది భక్తులు తరలివచ్చేలా క్రియాశీలక పాత్ర పోషించారని అభినందించారు. మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ గుడి ఇనాగరేషన్ నిర్వహించడం సమ్మక్క–సారలమ్మ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిందని, చలిలోనూ రాత్రివరకు సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతం చేసిన కార్యకర్తలు, భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో డోలు, సన్నాయి, కోయ నృత్యాలు, గుస్సాడి, కొమ్ము కోయ, నాయకపోడు లక్ష్మీదేవర వంటి గిరిజన కళారూపాలు ఆకట్టుకున్నాయని చెప్పారు. బుధవారం నుంచి ‘మండమెలిగే పండుగ’ ప్రారంభమై, 28న నిండు పండుగ కన్నెపల్లి నుంచి సారలమ్మ రాక, 29న చిలకల గుట్ట నుంచి సమ్మక్క గద్దెలపైకి రావడం, 30–31 తేదీల్లో భక్తులకు విస్తృత దర్శనం కల్పించి సాయంత్రం వనప్రవేశంతో జాతర ముగుస్తుందన్నారు. రాజకీయాలకు అతీతంగా దేవుని సన్నిధిలో అందరూ ఆహ్వానితులేనని, కార్డులు కేవలం సమాచారానికేనని స్పష్టం చేశారు. ములుగు జిల్లాకు సంబంధించి మంత్రి వర్గ సమావేశంలో రూ.143 కోట్లతో పొట్లాపురం లిఫ్ట్ ద్వారా 15 వేల ఎకరాలకు సాగునీరు, జంపన్న వాగు, రామప్ప, లక్నవరం కనెక్షన్‌కు రూ.35 కోట్ల నిధులతో చేపట్టే ప్రకటన రైతులకు మేలు చేస్తుందని తెలిపారు. గోదావరి పుష్కరాల దృష్ట్యా బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి సర్క్యూట్ అభివృద్ధి, మల్లూరు లక్ష్మీనరసింహస్వామి, కన్నాయిగూడెం, వాజేడు, ఏటూరునాగారం, వెంకటాపురం, మంగపేట ప్రాంతాల దేవాలయాలు, ఘాట్ల అభివృద్ధికి సబ్‌కమిటీ ఏర్పాటైందని చెప్పారు.

– బస్టాండ్, బస్ డిఓ పనుల్లో నిర్లక్ష్యంగా వ్యహించిన వారిపై చర్యలు

ములుగు బస్టాండ్‌, ఏటూరునాగారంలో బస్ డిపో నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని మంత్రి సీతక్క హెచ్చరించారు. జాతర దృష్ట్యా అదనపు బస్సులు నడిపిస్తామని భరోసా ఇచ్చారు. చివరగా 28 నుంచి 31 వరకు నిండు పున్నమిలో జరిగే మహాఘట్టంలో భక్తులందరూ సంయమనం పాటిస్తూ పాల్గొని మేడారంలో సమ్మక్క–సారలమ్మల ఆశీస్సులు పొందాలని మంత్రి సీతక్క కోరారు. మేడారం ట్రస్ట్ బోర్డు కమిటీలో సైతం మహిళలకు ప్రాధాన్యత ఇచ్చామని గుర్తు చేశారు. మీడియా సమావేశంలో మంత్రి వెంట కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకలు అశోక్, మేడారం ట్రస్‌ బోర్డు చైర్ పర్సన్ ఇర్ప సుకన్య, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కళ్యాణి, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!