రైతు ఆత్మహత్య కుటుంబాలను ఆదుకోవాలి
వెంకటాపూర్, జనవరి9(తెలంగాణజ్యోతి): రైతు ఆత్మహత్య కుటుంబా లను ఆదుకోవాలని రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ ప్రతినిధి కర్నాటకపు సమ్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవి పేట గ్రామంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు ల్యాదల్ల నరేష్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం బావుసింగ్ పల్లెకు చెందిన నరేష్ గత ఏడేళ్లుగా ఆరు ఎకరాల వరి పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తూ పెట్టుబడుల కోసం సుమారు రూ.10 లక్షల అప్పులు చేసినప్పటికీ వరుసగా నాలుగేళ్లుగా దోమ, ఎండు తెగుళ్ల వల్ల సరైన దిగుబడి రాక అప్పులు తీర్చలేక మానసిక వేదనతో 2025 జూలై 11న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన తెలిపారు. నరేష్ భార్య రేణుక, నర్సరీ చదువుతున్న కుమారులు నితిన్, అభిరామ్‌తో కలిసి ప్రస్తుతం లక్ష్మీదేవి పేటలో నివసిస్తున్నారని పేర్కొన్నారు. కుటుంబ పరిస్థితిని రూరల్ డెవలప్మెంట్ సర్వీసు సొసైటీకి తెలియజేయడంతో రూ.50 వేల ఆర్థిక సహాయం అందించి కిరాణా దుకాణం ఏర్పాటు చేయించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా రైతు ఆత్మహత్య కేసులకు సంబంధించిన 194 జి.ఓ.ను పూర్తిస్థాయిలో అమలు చేసి ప్రతి కుటుంబానికి రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా వాలంటీర్ చల్లగురుగుల సంజీవ్, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు కొండల్ రెడ్డి, ముక్క ఐలన్న, గ్రామ సర్పంచ్ బొమ్మకంటి వంశావతి, ఉప సర్పంచి కొండా తిరుపతి, అల్లం ఓదేలు, వార్డు సభ్యులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.





