రాజకీయ లబ్ధి కోసమే మంత్రి శ్రీధర్ బాబుపై తప్పుడు ఆరోపణలు
– కాటారంలో కాంగ్రెస్ నేతల విమర్శ
కాటారం, జనవరి 04 (తెలంగాణ జ్యోతి): రాజకీయ లబ్ధి కోసమే శ్రీధర్ బాబుపై చల్లారి నారాయణరెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కాటారం మండల కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ఆదివారం కాటారంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వారు మాట్లాడుతూ, అభివృద్ధి, సంప్రదాయాలపై మాట్లాడే నైతిక అర్హత చల్లారికి లేదని, గతంలో యువతను చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ప్రేరేపించడం, రౌడీయిజం, భూకబ్జాలు, అక్రమ వసూళ్లు, మాఫియా కార్యకలాపాలపై ఆరోపణలు ఎదుర్కొన్నది ఆయనేనని అన్నారు. శ్రీధర్ బాబు చేసిన అభివృద్ధి పనుల సమయంలో ఆయన వెంట ఉన్నవాడే నేడు ఆరోపణలు చేయడం ద్వంద్వ వైఖరని, ప్రజాసేవ పేరిట పదవులు పొందిన తర్వాత స్వచ్ఛందంగా గెలిచానని చెప్పుకోవడం సరికాదని ప్రశ్నించారు. మంథని నియోజక వర్గంలో గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లే రావడం, స్వంత వర్గాల నుంచే మద్దతు లేకపోవడం ఆయన రాజకీయ స్థితిని స్పష్టం చేస్తుందని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ గృహాలు, చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు, భూముల వ్యవహారాల్లోనూ అక్రమాలపై ఆరోపణలు చేస్తూ, గెజిట్‌తో చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేమునూరు ప్రభాకర్ రెడ్డి, స్టీరింగ్ కమిటీ చైర్మన్ కుంభం రమేష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గద్దె సమ్మిరెడ్డి, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్యসহ పలువురు నాయకులు పాల్గొన్నారు.





