వార్డుల విభజన సక్రమంగా జరగలేదు
ఒకే వార్డులో డబుల్ ఓట్లు ఎలా ఉన్నాయి
కమిషనర్ కు వివిధ పార్టీల నాయకుల ప్రశ్న
ములుగు, జనవరి5, తెలంగాణజ్యోతి : మున్సిపాలిటీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ ఓటరు జాబితాలో దొర్లిన తప్పులపై మున్సిపల్ కమిషనర్ సంపత్ ను వివిధ పార్టీల నాయకులు ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం ములుగులోని గాంధీ విగ్రహం సమీపంలోని హాల్ లో వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులు, కార్యదర్శులతో జరిగిన సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు. ఓటరు లిస్ట్ పై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా తెలపాలని సూచించారు. అయితే కొన్ని వార్డుల్లో డబుల్ ఓట్లు నమోదు అయ్యి ఉన్నాయని, వాటిని ఎప్పుడు సరిచేస్తారని ప్రశ్నించారు. అదేవిధంగా కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన ములుగులో బండారుపల్లి, జీవంతరావుపల్లి వార్డులను కలుపగా వార్డుల విభజన సక్రమంగా చేయలేదని ప్రశ్నించారు. జీవంతరావుపల్లి జీపీ నుంచి ములుగులోని పాల్సాబ్పల్లి, తదితర ప్రాంతాల అనంతరం మళ్లీ బండారుపల్లిని కలుపుతూ వార్డుల విభజన చేశారని, ఈవిధానం సరికాదని బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు ప్రశ్నించారు. అయితే ఈ విషయంపై మంగళవారం అదనపు కలెక్టర్ సంపత్ రావు వద్ద మీటింగ్ ఉందని, ఆ సందర్భంలో చర్చించుదామని తెలిపారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు.






