భూపాలపల్లి జిల్లాను రద్దు చేసే కుట్రలను మానుకోవాలి
కేసీఆర్ పాలనలోనే భూపాలపల్లి సమగ్ర అభివృద్ధి
హామీలు అమలు చేయని ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : గండ్ర వెంకట రమణా రెడ్డి
భూపాలపల్లి, జనవరి 7, తెలంగాణ జ్యోతి : భూపాలపల్లి జిల్లాను రద్దు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి హెచ్చరించారు. ఈ రోజు బస్తీబాట కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డు కార్లమార్క్స్ కాలనీలో పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గతంలో భూపాలపల్లిలో తాగునీటి సమస్య ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసని, ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి ప్రతి ఇంటికీ గోదావరి జలాలు అందించిన దూరదృష్టి గల నాయకత్వం కేసీఆర్ దేనని తెలిపారు. అలాగే ప్రతి ఇంటికీ ఇరవై నాలుగు గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందించిన ఘనత కూడా కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం కాకుండా అభివృద్ధి కార్యక్రమాలను సమాంతరంగా అమలు చేసిన ప్రభుత్వం ఇదేనని పేర్కొన్నారు. ఒకప్పుడు చిన్న గ్రామ పంచాయతీ స్థాయిలో ఉన్న భూపాలపల్లి ఈ రోజు జిల్లా కేంద్రంగా ఎదిగి కలెక్టర్, ఎస్పీతో పరిపాలన కొనసాగిస్తోందంటే అది కేసీఆర్ పాలన ఫలితమేనన్నారు. పదేళ్లుగా కొనసాగుతున్న ముప్పై మూడు జిల్లాల వ్యవస్థపై ఇప్పుడు మళ్లీ చర్చలు తెరపైకి తేవడం వెనుక ఉద్దేశ్యం ఏమిటో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికల సమయంలో మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు, వృద్ధులు వితంతువులకు నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలయ్యాయా అని ప్రజలు ఆలోచించాలని ప్రశ్నించారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పథకాల జాబితాల పేరుతో ప్రజలను భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటికి భయపడకుండా గత రెండు సంవత్సరాలుగా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. సీలింగ్ సర్ప్లస్ భూములపై ఇళ్ల నిర్మాణ సమయంలో తాను ప్రభుత్వంతో పోరాడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగేలా చేశానని గుర్తు చేస్తూ, ఆ పోరాటాల ఫలితంగానే ఈ రోజు ప్రజలకు హక్కులు వచ్చాయని తెలిపారు. భూపాలపల్లిలో కలెక్టర్ కార్యాలయం, డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల, మెడికల్ కళాశాల, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రావడం కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమైందన్నారు. ప్రస్తుతం రైతులు ఎరువులు, సాగునీరు, విద్యుత్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతుబంధు వంటి పథకాలు పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అహంకార ధోరణితో పాలన సాగిస్తే ప్రజాస్వామ్య బద్ధంగా తగిన సమయంలో తగిన సమాధానం తప్పక ఇస్తారని హెచ్చరిస్తూ, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారని, ప్రజల పక్షాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి ఎప్పుడూ అండగా ఉంటుందని, కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలపరచాల్సిన అవసరం ఉందని గండ్ర వెంకట రమణా రెడ్డి స్పష్టం చేశారు.






