భారత కమ్యూనిస్టు పార్టీ శతవసంతాలు
వెంకటాపురం, డిసెంబర్ 26, తెలంగాణ జ్యోతి: భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శతవసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని గెస్ట్ హౌస్ ఆవరణలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ములుగు జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జునరావు పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ, పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు గడిచినా పేద, శ్రామిక ప్రజల హృదయాల్లో సిపిఐ చెక్కుచెదరకుండా నిలిచిందని అన్నారు. రాబోయే జనవరి 18న లో జరగనున్న భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కార్మిక సోదరులు, ప్రజాసంఘాల నాయకులు, సానుభూతిపరులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. మహిళలు ఎర్ర చీరలు, పురుషులు ఎర్ర చొక్కాలు ధరించి సభకు హాజరుకావాలని సూచిస్తూ, సభ విజయార్థం కార్యకర్తలు ఇళ్లకు వచ్చి విరాళాలు సేకరిస్తారని, ప్రతి ఒక్కరూ స్పందించి పార్టీకి తోచిన సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కట్ల రాజు, ఆది నారాయణ, బొల్లె నరసింహరావు, అప్పాల సత్యం, లక్ష్మీనారాయణ తో పాటు మహిళా కార్యకర్తలు, వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.





