కిటకిటలాడుతున్న రంగుల దుకాణాలు
ముత్యాల ముగ్గులతో నూతన సంవత్సరానికి స్వాగతం
వెంకటాపురం, డిసెంబర్ 31,తెలంగాణ జ్యోతి : నూతన సంవత్సరానికి స్వాగతం పలికే వేళ వెంకటాపురం పట్టణం పండుగ వాతావరణంతో కళకళలాడుతోంది. ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ రంగురంగుల అక్షరాలతో ముత్యాల ముగ్గులు వేసేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారు. రంగుల దుకాణాలు, ముగ్గుల పిండి విక్రయ కేంద్రాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా వస్త్ర, బంగారం, మిఠాయి, బేకరీ దుకాణాల్లో రద్దీ కనిపిస్తోంది. యువతను ఆకర్షించే బిర్యానీ పాయింట్లు, నాన్వెజ్ వంటకాల కేంద్రాలు ప్రత్యేకంగా సిద్ధమ య్యాయి. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ట్రాఫిక్ నియంత్రణకు మెయిన్ సెంటర్, అంబేద్కర్ సెంటర్లలో పోలీసులను నియమించారు. పల్లెల్లో బంధువుల రాకపోకలు, పిండి వంటలు, ముత్యాల ముగ్గులతో నూతన సంవత్సర సందడి నెలకొంది.







