మేడారం జాతరకు కేంద్రం రూ.3 కోట్ల 70 లక్షలు మంజూరు
కేంద్ర ప్రభుత్వ నిధుల విడుదల
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ
గిరిజన–పర్యాటక మంత్రిత్వ శాఖల మంజూరు
గిరిజన సర్క్యూట్, రామప్ప అభివృద్ధికి తోడ్పాటు
భక్తుల కోసం 30 ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్, జనవరి 23 (తెలంగాణ జ్యోతి): మేడారం జాతరకు రూ.3 కోట్ల 70 లక్షలు అనే శీర్షికతో గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలు కలిపి మొత్తం రూ.3 కోట్ల 70 లక్షలను మంజూరు చేశాయి. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ‘గిరిజన సర్క్యూట్’ పేరిట గతంలో రూ.80 కోట్లతో ములుగు, లక్నవరం, మేడారం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బొగత జలపాతం తదితర ప్రాంతాల్లో పర్యాటకు లను ఆకర్షించేలా మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.140 కోట్లు ఖర్చు చేస్తోంది. అలాగే అమ్మవార్లకు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం జాతర జరిగే నాలుగు రోజుల పాటు దక్షిణ మధ్య రైల్వే శాఖ 30 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.






