మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలి
ములుగు మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేష్ రెడ్డి
ములుగు, జనవరి2, తెలంగాణ జ్యోతి : రానున్న ములుగు మున్సిపల్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జెండా ఎగరాలంటూ బీఆర్ఎస్ ములుగు మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేష్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ములుగు మండలంలో మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ ఎన్నికలకు సన్నద్ధం అవుతోందని, ఈ నేపథ్యంలో ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త సైనికుల్లా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీల అమలులో జరిగిన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఎన్నికలు సమీపించినప్పుడు మాత్రమే కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు చెన్న విజయ్, గోవింద్ నాయక్, సకినాల భవాని, భిక్షపతి మహేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







