Tata Power | రాష్ట్రంలో భారీ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్న టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్
డెస్క్ : ప్రముఖ టాటా గ్రూప్‌కు చెందిన Tata Power Renewable Energy Limited రాష్ట్రంలో భారీ స్థాయి పారిశ్రామిక పెట్టుబడికి ముందుకొచ్చింది. Nelloreలో రూ.6,675 కోట్ల పెట్టుబడితో 10 గిగావాట్ల సామర్థ్యం గల ఇంగాట్, వేఫర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దేశంలోనే అతిపెద్ద ఇంగాట్–వేఫర్ తయారీ కేంద్రంగా ఇది నిలవనుంది.
ముఖ్యమంత్రి Chandrababu Naidu అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఈ ప్రాజెక్టుకు అధికారిక ఆమోదం లభించింది. IFFCO Kisan Special Economic Zoneలో ఈ ఫ్యాక్టరీని నిర్మించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 200 ఎకరాల భూమిని కేటాయించింది. తొలిదశలో 120 ఎకరాలు, భవిష్యత్ విస్తరణ కోసం మరో 80 ఎకరాలు వినియోగించనున్నారు.
సోలార్ సెల్స్, మాడ్యూల్స్, సెమీకండక్టర్ల తయారీలో ఇంగాట్లు, వేఫర్లు కీలకమైనవి. ఈ ప్రాజెక్టుతో దేశీయ ఉత్పత్తి పెరిగి దిగుమతులపై ఆధారపడటం గణనీయంగా తగ్గనుంది. ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా సుమారు 1,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అదనంగా, ఫ్యాక్టరీ అవసరాల కోసం 200 మెగావాట్ల గ్రీన్ పవర్ ప్లాంట్‌ను కూడా టీపీఆర్ఈఎల్ ఏర్పాటు చేయనుంది.
ఈ పెట్టుబడిపై రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి Nara Lokesh హర్షం వ్యక్తం చేశారు. “ఆంధ్రప్రదేశ్‌లో టాటా గ్రూప్ మరో చారిత్రక పెట్టుబడి పెట్టడం గర్వకారణం. ప్రభుత్వ పాలనా స్థిరత్వం, మౌలిక వసతులు, స్వచ్ఛ ఇంధన తయారీకి ఇస్తున్న ప్రాధాన్యతపై ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనం. ఈ ప్రాజెక్టు ద్వారా నాణ్యమైన ఉద్యోగాలు లభిస్తాయి” అని ఆయన పేర్కొన్నారు.




