విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందించాలి
డబ్బు బతకడానికే తప్ప అంతిమ లక్ష్యంగా ఉండకూడదు
శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి
ములుగులో ప్రజ్క్షా వికాస్ లో విద్యార్థులకు అవగాహన
ములుగుప్రతినిధి, జనవరి8, తెలంగాణ జ్యోతి : విద్యార్థులు భవిష్యత్ తరాలని, వారికి విలువలతో కూడిన విద్య అందించాలని, ఆ బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి పిలుపునిచ్చారు. ప్రజ్ఞా వికాస్ కార్యక్రమంలో భాగంగా గురువారం ములుగులోని అరవింద ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలు, కోలాటంతో ఘనస్వాగతం పలికారు. రామానుజ జీయర్ స్వామి మాట్లాడుతూ.. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి మంగళశాసనములతో రాష్ట్రంలోని 33జిల్లాల్లో ఒక్కో జిల్లాకు ఒక పాఠశాలను ఎంచుకుని విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందించాలనే మహా సంకల్పంతో అవగాహన సదస్సులు నిర్వహిం చడం జరుగుతుందన్నారు. విద్య అనేది కేవలం ధన సంపాదన కోసం మాత్రమే కాకుండా విలువలతో కూడిన జీవితాన్ని అందించడమే పరమావధిగా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. బతకడానికి డబ్బు అవసరం అని కానీ, అదే అంతిమ లక్ష్యం కాకూడదని పేర్కొన్నారు. విద్యార్థులు భౌతికంగా తరగతి గదిలో ఉన్నా మానసికంగా చదువు కునేందుకు సంసిద్ధత పాటించలేకపోతున్నారని వెల్లడించారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ దిశగా పయనించాలని సూచించారు. శాస్త్ర సాంకేతికతను ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు మాత్రమే ఉపయోగించుకోవాలని, (అతి సర్వత్ర వర్జయేత్) అతి ఎప్పుడూ పనికిరాదని స్పష్టం చేశారు. భారతీయులంతా బానిసలుగా ఉండాలని భారతీయులకు చరిత్ర, విజ్ఞానాన్ని అందకుండా చేయాలని కుటీలమైన మనస్తత్వంతో బ్రిటిష్ ప్రభుత్వం మెకాలే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింద న్నారు. ఇప్పటికి కూడా దాన్ని మనం పాటించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. పాలకులు విద్యావ్యవస్థలో విలువలు చేర్పేలా మార్పులు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ అక్కల సతీష్, ట్రస్మా రాష్త్ర గౌరవ అధ్యక్షుడు యాదగిరి శేఖరరావు, ధర్మ జాగరణ సమితి ప్రతినిధులు గండ్రకోట కుమార్, వాంకుడోత్ జ్యోతి, ముక్కు సుబ్బారెడ్డి, రవిరెడ్డి, సూర్యదేవర ఆనందం, మమన్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.





