ఓటు విలువపై అవగాహన ర్యాలీతో విద్యార్థుల సందేశం
అన్నలారా.. అక్కలారా.. ఓటును అమ్ముకోవద్దు
ములుగు, డిసెంబర్12, తెలంగాణ జ్యోతి : ప్రజాస్వామ్య బలపరచడం లో ప్రతి ఓటు కీలకమనే సందేశాన్ని సమాజానికి చేరవేయాలనే లక్ష్యంతో ములుగు జిల్లా కేంద్రంలో బ్రిలియంట్ గ్రామర్, వివేకవర్ధిని హై స్కూల్ విద్యార్థులు శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. “అన్నలారా… అక్కలారా… ఓటు ప్రాధాన్యత తెలుసుకోండి” అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు ప్రధాన వీధుల్లో ర్యాలీగా సాగి ప్రజల్లో ఓటు హక్కుపై చైతన్యం కలిగించారు. విద్యార్థులు పట్టుకున్న ప్లకార్డుల్లో ఓటు హక్కు విలువ, బాధ్యతాయుత ఓటింగ్ అవసరం, ఎన్నికల్లో డబ్బు–ప్రలోభాలకు లొంగరాదు, నైతిక ఓటింగ్‌తో మంచిసమాజం నిర్మిద్దాం వంటి సందేశాలు ప్రజల దృష్టిని ఆకర్షించాయి. చిన్నప్పటి నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన పెంపొందితే భవిష్యత్తు భారత నిర్మాణం మరింత శక్తివంతమవుతుందని స్కూల్ యాజమాన్యం సంతోష్ తెలిపారు. యువతరమే రేపటి నాయకత్వం కాబట్టి, వారు సమాజంలో చైతన్యం తీసుకురావడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థులు ముందుగా తమ కుటుంబాల్లోనే అవగాహన కల్పిస్తూ, ఇంట్లో పెద్దలందరూ తప్పనిసరిగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో మంచి మార్పు ఓటు పెట్టే క్షణం నుంచే ప్రారంభమవుతుందని వారు స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు చిర్రా నరేష్ గౌడ్, ముద్దం సంతోష్ చక్రవర్తి, ప్రిన్సిపాల్ ఎస్.ఎన్. హరి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఓటు విలువ ర్యాలీ పట్ల స్థానికులు విద్యార్థులను అభినందించారు.






