శివపురం–గోగుపల్లి నేతలు గులాబీ గూటిలో చేరిక
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : శివపురం–గోగుపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బతగిలింది. గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీరాములు, పులిష రమేష్, మొప్ప సురేష్, నూనె రవి తదితరులు ఏటూరునాగారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరగా, ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు గులాబీ కండువా కప్పి వారిని ఆత్మీయంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదన్న అసంతృప్తి, సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ప్రజల స్పందనతో పాటు మాజీ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలపై నమ్మకం తమ నిర్ణయానికి కారణమని శ్రీరాములు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిరాశలో నెట్టిందని, త్వరలో కేసీఆర్ పునర్వ్యవస్థాపనతో సంక్షేమం తిరిగి పుంజుకుంటుందనే నమ్మకం ఉందని కాకులమర్రి లక్ష్మణ్ బాబు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో తుమ్మ మల్లారెడ్డి, అంతటి విజయనాగరాజు, తుమ్మ సంజీవరెడ్డి, కోనేరు నాగేశ్, ఏనుగుల మహేష్ తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.






