ఆకర్షణ పేరుతో ఏర్పాటు.. పనిచేయని రంగుల దీపాలు..
ములుగు, జనవరి 16 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా కేంద్రంలో ఏరియా ఆసుపత్రి నుంచి తోపుకుంట సీసీ రోడ్డు వరకు అట్రాక్షన్ పేరుతో లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన రంగురంగుల లైట్లు సరిగా పనిచేయడం లేదు. సెంటర్ లైటింగ్‌లో కూడా కొన్ని వీధి దీపాలు వెలగక పోవడంతో రాత్రి వేళ రహదారి చీకటిగా మారుతోంది. ఇదే మార్గంలో డివైడర్ కోసం ఏర్పాటు చేసిన గుంతలను మట్టితో పూడ్చకపోవడంతో పాటు, సీసీ రోడ్డు పక్కన వేయాల్సిన సైడ్ బర్మ్ పనులు కూడా పూర్తి కాకపోవడం వల్ల ప్రమాదాల ముప్పు పెరిగింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, నడిచే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజాధనంతో చేపట్టిన పనుల్లో ఈ స్థాయి నిర్లక్ష్యం తగదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అధికారులు తక్షణమే స్పందించి లైట్లు, డివైడర్ గుంతలు, సైడ్ బర్మ్ పనులు పూర్తిచేయాలని డిమాండ్ చేస్తున్నారు.






