పాఠశాల వంట కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.
- రాజకీయ పార్టీలు వారి మ్యానిఫెస్టోలో చేర్చాలి.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం గ్రామంలో గురువారం ఏఐటియూసీ అనుబంధ తెలంగాణ మధ్యాహ్నం భోజన పథకం వర్కర్స్ యూనియన్ హెచ్. 80 వెంకటాపురం మండల మహసభను కుడుముల సమ్మక్క అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సిపిఐ ములుగు జిల్లా కార్యదర్శి తోట మల్లిఖార్జునరావు, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,జంపాల రవీందర్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంట కార్మికుల పోరాటాలకు సిపిఐ పార్టీ ఎల్లవేళలా మద్దతుగా ఉంటుందని తెలియజేసారు. పాఠశాలల్లో వంట కార్మికులుగా గత 22, సంవత్సరాలుగా వంటలు చేస్తూ, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తూ వంట కార్మికులు మాత్రం కేవలం వేయి రూపాయల వేతనంతో పనిచేస్తున్నారన్నారు. అనేక పోరాటాల ఫలితంగా గౌరవ ముఖ్యమంత్రి 2 వేలు అధనముగా పెంచుతూ రూపాయలు 3 వేలు అందిస్తామని 2022 సం. ఫిబ్రవరిలో అసెంబ్లీలో ప్రకటించారన్నారు. ఆ తర్వాత జరిగిన పోరాటాలకు జీవో నెంబర్ 8 విడుదల చేయిస్తూ వేతనం అందిస్తాము అన్నారు. కానీ వేతనాలు నేటికీ కార్మికులకు అందలేదని అన్నారు. కార్మికులు ఎలా వంటలు చేయాలో ప్రభుత్వమే ఆలోచించాలన్నారు. అది కాక 9,10 తరగతుల విద్యార్థులకు ఉచితంగానే వంట చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి అల్పాహారం అనే పథకాన్ని ఎలాంటి విధివిధానాలు లేకుండా వంట కార్మికుల శ్రమ ప్రస్తావన లేకుండా, ప్రకటించడం జరిగిందన్నారు. వంట కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్, సౌకర్యంతో పాటు హెల్త్ కార్డులు అందించాలని యూనిఫామ్ సౌకర్యం కల్పించాలని ,రిటైర్మెంట్ బెనిఫిట్ సైతం కల్పించాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలు పై అంశాన్ని వారి మ్యానిఫెస్టోలో పెట్టి వారి నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. అనంతరం తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ వెంకటాపురం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మండల అధ్యక్షులు కట్ల రాజు, గుమ్మెల్ల సరోజన, కుడుముల సమ్మక్క, కొక్కురు రాంబాబు, గంప భద్రమ్మ,అమ్మాజి ఎలకం సావిత్రి, కొర్స లక్ష్మినరసమ్మ, రాధమ్మ, పెంటమ్మ, లక్ష్మి, జ్యోతి, నీలమ్మ, తిరుపతమ్మ, రమణ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.