ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
వెంకటాపురంనూగూరు, జనవరి3,(తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని చక్రి మీ సేవలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మీ సేవ నిర్వాహకులు చిట్యాల రోజా, చక్రి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అక్షరజ్ఞానం లేని అణగారిన, దళిత, బడుగు బలహీన వర్గాల మహిళలకు విద్య వెలుగు అందించిన మహోన్నత యోధురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. స్త్రీ హక్కుల సాధన, అంటరానితన నిర్మూలన, సమసమాజ స్థాపన కోసం నిరంతరం పోరాడిన సంఘ సంస్కర్తగా ఆమె సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాజ హితార్థం కోసం అహర్నిశలు శ్రమించి తన జీవితాన్నే అర్పించిన ఉద్యమ వనితగా సావిత్రిబాయి పూలే చరిత్రలో నిలిచారని అన్నారు. నేటి ఆధునిక భారతదేశంలో మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో నిలవడానికి పూలే దంపతుల కృషే ప్రధాన కారణమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సోనీ, శ్రీరామ్, మద్దుకూరి నెహ్రూ గాంధీ తదితరులు పాల్గొన్నారు.





