ఏటూరునాగారంలో రోడ్డు ప్రమాదం – లోయలోకి దూసుకెళ్లిన వాహనాలు
ఏటూరునాగారం, జనవరి 9 (తెలంగాణ జ్యోతి): ఏటూరునాగారంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల పరిధిలోని జాతీయ రహదారి–163పై ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో కారు, భారీ క్రేన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఢీకొన్న ఘటనలో రెండు వాహనాలు రహదారి పక్కన ఉన్న లోయలోకి దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్సులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.





