క్షేమంగా గమ్యస్థానాలకు చేరాలి : అవగాహన కల్పించిన పోలీసులు
వెంకటాపురం (నూగురు), జనవరి 13 (తెలంగాణ జ్యోతి): క్షేమంగా గమ్యస్థానాలకు చేరాలనే లక్ష్యంతో ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రోడ్డు ప్రయాణ భద్రతపై డ్రైవర్లు, ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాల నివారణపై పోలీసులు వివరించారు. వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్యం రమేష్, ఎస్సై కే. తిరుపతిరావు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు, ఇతర వాహనాల చోదకులకు రోడ్డు భద్రతపై విస్తృతంగా అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సీటు బెల్టు వినియో గించాలని వారు సూచించారు. అలాగే పరిమితికి మించి ఓవర్‌లోడ్‌తో ప్రయాణం చేయకూడదని హెచ్చరించారు.
రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల దీనస్థితిని వివరిస్తూ, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాల్సిన అవసరం ఉందని పోలీసులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించి, ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం మేజర్ పంచాయతీ సర్పంచ్ తాటి సరస్వతి, ఉప సర్పంచ్ షేక్ షర్భుందీన్, తాలూకా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడం సాంబశివరావు, ఆటో డ్రైవర్లు, మీడియా మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






