మేడారంలో చిన్నారులు తప్పిపోకుండా క్యూఆర్ కోడ్
జాతర భక్తులకు సూచించిన పోలీసులు
ములుగు, జనవరి 24 (తెలంగాణ జ్యోతి): మేడారం జాతర–2026 సందర్భంగా జాతరకు విచ్చేసే భక్తులకు ముఖ్య గమనికగా ఒక అవగాహన వీడియోను విడుదల చేశారు. జాతరలో తల్లిదండ్రుల నుంచి చిన్నారులు తప్పిపోకుండా ఉండేందుకు క్యూఆర్ కోడ్ (QR Code) ఉన్న ప్రత్యేక చేతి బ్యాండ్లను పోలీసు శాఖ అందిస్తున్నట్లు వీడియోలో తెలిపారు. ఈ బ్యాండ్లను పొందేందుకు బస్టాండ్ల సమీపంలో ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. అక్కడ చిన్నారి పేరు, వయసు, తండ్రి పేరు, తండ్రి మొబైల్ నంబర్ తదితర వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుందని, రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక క్యూఆర్ కోడ్ ఉన్న బ్యాండ్‌ను చిన్నారి చేతికి వేస్తారని వివరించారు.
జాతర ప్రాంగణంలో ఎవరైనా చిన్నారులు తప్పిపోయి తిరుగుతూ కనిపిస్తే, వారి చేతికి ఉన్న రిస్ట్ బ్యాండ్‌పై ముద్రించిన క్యూఆర్ కోడ్‌ను మొబైల్ ఫోన్ ద్వారా స్కాన్ చేయాలని పోలీసు శాఖ కోరింది. స్కాన్ చేసిన వెంటనే ముందుగా నమోదు చేసిన చిన్నారి వివరాలు మొబైల్‌లో కనిపిస్తాయని తెలిపారు. అందులో కిందకు స్క్రోల్ చేసి మీ మొబైల్ నంబర్ నమోదు చేసి ‘Call Parent’ బటన్‌పై క్లిక్ చేస్తే తల్లిదండ్రులకు నేరుగా కాల్ వెళ్లే సదుపాయం ఉందని, లేదా ‘Call Control Room’ బటన్‌పై క్లిక్ చేసి మీ ఫోన్ నంబర్ నమోదు చేయడం ద్వారా పోలీసు అధికారులకు చిన్నారి వివరాలు తెలియజేయవచ్చని పేర్కొన్నారు.
తల్లిదండ్రులు లేదా బంధువులు చిన్నారిని గుర్తించి మీ వద్దకు వచ్చిన తర్వాత ‘Unite Updation’ బటన్‌పై క్లిక్ చేసి, మీ మొబైల్ నంబర్, తేదీ, సమయం, చిన్నారిని ఎవరికి అప్పగిస్తున్నారన్న వివరాలు నమోదు చేయాలని సూచించారు. అనంతరం ‘Photo Upload’ ఎంపిక ద్వారా చిన్నారిని అప్పగిస్తున్న సమయంలో తీసిన ఫోటోను అప్లోడ్ చేసే వెసులుబాటు కూడా ఉందని వీడియోలో స్పష్టం చేశారు. చిన్నారుల భద్రతకు సహకరిస్తున్న భక్తులందరికీ తెలంగాణ పోలీసు శాఖ ధన్యవాదాలు తెలియజేసింది.






