ఐదు లక్షల గృహ పథకంలో పేదవారికి ప్రాధాన్యత కల్పించాలి
ములుగు, తెలంగాణ జ్యోతి : జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో సిపిఐ గ్రామ శాఖ సమావేశాన్ని బోడ రమేష్ అధ్యక్షతన నిర్వహించగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీలను ఒకటి ఒకటిగా అమలు చేస్తుండడం గర్వించదగ్గ విషయమేనన్నారు. అలాగే 11వ తేదీ నుండి ప్రారంబించే ఐదు లక్షల గృహ పథకంలో, నిజమైన పేదవారిని గుర్తించి, స్థలంతో పాటు ఐదు లక్షలు అందించాలని కోరారు, అలాగే స్థలం ఉన్నవారికి 5 లక్షలు అందించే పథకంలో ఇల్లు లేని వారిని మాత్రమే గుర్తించాలని అన్నారు. ఇప్పటికీ నివాస స్థలాలు లేక కూలి, నాలి, చేస్తూ అద్దె గృహాలలో కొనసాగిస్తున్న చాలామంది పేదవారిని గుర్తించాల్సిన అవసరం అధికారులకు ఉందన్నారు. వారందరికీ నివాసయోగ్యమైన స్థలాలను అందించాలన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆధీనంలో ఉన్న ,ప్రభుత్వ భూములను గుర్తించి స్వాధీనం చేసుకోవాలని అన్నారు. అలా చేయని పక్షంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సి వస్తుందన్నారు. ఈ సమావేశంలో సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శిగా బోడ రమేష్, సభ్యులుగా ఇంజం కొమురయ్య, కొయ్యడ లక్ష్మి, ఎస్డి అఖిల్, ఎండి ఫయాజ్, బండ రాజు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి ముత్యాల రాజు, సిపిఐ జిల్లా నాయకులు ఎండి అంజద్ పాష లతోపాటు తదితరులు పాల్గొన్నారు.