అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే తమ లక్ష్యం
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
తొర్రూరు, జనవరి (తెలంగాణ జ్యోతి): అన్ని వర్గాల ప్రజల సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి స్పష్టం చేశారు. తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో కులాల వారీగా సుమారు రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ భవనాలను ఆమె ప్రారంభించారు. ఇందులో భాగంగా 10వ వార్డులో టి.యు.ఎఫ్.ఐ.డి.సి (TUFIDC) నిధుల నుంచి మంజూరైన రూ.30 లక్షలతో నిర్మించిన వివేకానంద కమ్యూనిటీ భవనాన్ని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వామి వివేకానంద ఆశయాలకు అనుగుణంగా సమాజ సేవ, యువత అభివృద్ధి, సామాజిక ఐక్యతను పెంపొందించే కార్యక్రమాలకు ఈ భవనం కేంద్రబిందువుగా నిలుస్తుందన్నారు. ఈ కమ్యూనిటీ భవనం ద్వారా శుభకార్యాలు, సమావేశాలు, మహిళా–యువత కార్యక్రమాలు, శిక్షణ శిబిరాలు, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించుకునే వీలు కలుగుతుందని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా మరిన్ని కమ్యూనిటీ భవనాలు, ప్రజాప్రయోజన భవనాలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే తమ ధ్యేయమని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, పార్టీ నాయకులు, స్వామి వివేకానంద సేవా సంఘం ప్రతినిధులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. రూ.30 లక్షల వ్యయంతో నిర్మితమైన వివేకానంద కమ్యూనిటీ భవనం ప్రారంభంతో 10వ వార్డు ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.






