జాతీయ రహదారిపై చెట్టు విరిగిపడి ఒకరు మృతి
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : జాతీయ రహదారి 163 పై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుడుపై భారీ వృక్షం మీద పడి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఏటూరు నాగారం మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఏటూరునాగారం మండలం చిన్న బోయినపల్లి గ్రామానికి చెందిన జాంగిర్ (30) పని నిమిత్తం చిన్న బోయినపల్లి జాతీయ రహదారి 163 మార్గం గుండా ద్విచక్ర వాహనంపై ఏటూరు నాగారం వెళ్తుండగా పోతురాజు బోరు సమీపాన జాతీయ రహదారి పక్కనే ఉన్న భారీ వృక్షం నేలకూలి అదే దారి వెంట వెళుతున్న జాంగిర్ మీద పడింది. ఈ ఘటనలో జాంగిర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఏటూరునాగారం ఎస్సై తాజుద్దీన్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఏటూరు నాగారం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా రోడ్డుపై అడ్డంగా కూలిన భారీ వృక్షం కారణంగా ట్రాఫిక్ జామయి రాకపోకలకు అంతరా యం ఏర్పడింది. ఎస్సై తాజుద్దీన్ పోలీస్ సిబ్బందితో కలిసి జెసిబితో భారీ వృక్షాన్ని తొలగించి యధావిధిగా రాకపోకలు కొనసాగేలా చేశారు. జాంగిర్ మృతితో చిన్న బోయినపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.