పోటాపోటీగా నామినేషన్లు – ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల పర్వం
వెంకటాపురం నూగూరు, డిసెంబర్5,తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో గ్రామ పంచాయతి ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రశాంతంగా ముగిసింది. వెంకటాపురం మండలంలోని 18, వాజేడు మండలంలోని 17 పంచాయతీలకు అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, వామపక్షాలు, బీజేపీ, కూటములు, స్వతంత్ర అభ్యర్థులు సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు. సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే నామినేషన్ల స్వీకరణ జరగడంతో, స్వీకరణ కేంద్రాల వద్ద అభ్యర్థులు భారీ క్యూలు కట్టారు. సమయం ముగియడంతో పోలీసులు గేట్లు మూసినప్పటికీ, ఇప్పటికే క్యూలో ఉన్న అభ్యర్థులందరికీ పోలింగ్ అధికారులు స్లిప్పులు ఇచ్చి, వారి నామినేషన్లను స్వీకరించారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, వెంకటాపురం పీఎసీసీఎస్ చైర్మన్ చిడెం మోహన్ రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిడెం సాంబశివరావు, సీనియర్ నాయకులు బాలసాని వేణుగోపాల్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మన్యం సునీల్, బాలసాని శ్రీనివాసరావు, మాజీ జెడ్పీటీసీ పి. రమణ, యువ కాంగ్రెసు అధ్యక్షుడు చిట్టెం సాయి తదితరులు పాల్గొన్నారు. మండలంలోని 18 పంచాయతీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల నామినేషన్లు సమగ్రంగా దాఖలు చేయించారు. మండలంలో ప్రతిష్ఠాత్మకమైన మేజర్ పంచాయతీ నుంచి పోటీ చేసేవారితో ప్రధాన రహదారి, మార్కెట్ సెంటర్ మీదుగా ప్రదర్శనగా వెళ్లి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ కేంద్రాల వద్ద హెల్ప్‌లైన్ సిబ్బంది అభ్యర్థులకు పత్రాల నింపుటలో సహకరించారు.





