భూ తగాదాల హత్య కేసులో 9 మందికి జీవిత ఖైదు
భూపాలపల్లి కోర్టు సంచలన తీర్పు
కాటారం, డిసెంబర్ 23, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామంలో భూమి తగాదాల నేపథ్యంలో 19-06-2021న జరిగిన త్రిపుల్ మర్డర్ కేసులో 9 మంది నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ ప్రిన్సిపల్ జిల్లా–సెషన్స్ న్యాయస్థానం, భూపాలపల్లి న్యాయమూర్తి సిహెచ్. రమేష్ బాబు సంచలన తీర్పు వెలువరించారు. లావుడ్య మహంకాళి నాయక్, లావుడ్య భాస్కర్ నాయక్, లావుడ్య సర్దార్ నాయక్, లావుడ్య బాపు నాయక్, కౌసల్య, లావుడ్య సారయ్య నాయక్, బాబు నాయక్, లావుడ్య సమ్మయ్య, అజ్మీర రాజ్ కుమార్‌లను దోషులుగా నిర్ధారించిన కోర్టు జీవిత ఖైదుతో పాటు రూ.31 వేల జరిమానా విధించింది. భూమి వివాదాలపై తరచూ గొడవలు జరుగుతున్న క్రమంలో, పత్తి చేనులో పనిచేస్తున్న మాంజా నాయక్‌పై అతని కుమారులతో కలిసి నిందితులు గొడ్డళ్లు, కర్రలతో కారం చల్లుతూ దాడి చేయగా మాంజా నాయక్‌తో పాటు కుమారులు సారయ్య నాయక్, భాస్కర్ నాయక్‌లు అక్కడికక్కడే మృతి చెందగా మరో కుమారుడు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. కేసును పోలీసులు శాస్త్రీయంగా దర్యాప్తు చేసి పక్కా ఆధారాలతో చార్జ్‌షీట్ దాఖలు చేయగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎదులాపురం శ్రీనివాస్ సమర్థవంతమైన వాదనలతో నిందితులపై నేరం రుజువైంది. దర్యాప్తులో అప్పటి డీఎస్పీ బోనాల కిషన్ పర్యవేక్షణలో ఎస్‌ఐ సాంబమూర్తి, సీడీఓ కె. రమేష్, లియాజన్ ఆఫీసర్ జి. వెంకన్నలు కీలక పాత్ర పోషించగా, జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ వారి సేవలను అభినందించారు. నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని, చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి.





