కన్నాయిగూడెం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్య ధోరణి
– పాము కాటు ఘటన తర్వాత కూడా మారని వైద్య సేవలు
– అత్యవసరంలోనూ ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి
కన్నాయిగూడెం, డిసెంబర్ 3, తెలంగాణ జ్యోతి : ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితులు ప్రజల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. పాము కాటు కారణంగా ఇటీవల ఓ బాలుడు మృతి చెందిన ఘటనలో ఆసుపత్రిలో వైద్యుడు లేకపోవడం, యాంటీ వెనం అందుబాటులో లేకపోవడం ఆరోగ్య శాఖ నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసింది. విమర్శల నేపథ్యంలో డాక్టర్ను బదిలీ చేసినా ఆసుపత్రి సేవల్లో ఎలాంటి మార్పు లేకపోవడం ప్రజలను మరింత నిరాశకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం తీవ్ర అనారోగ్యంతో ఉన్న ధర్మయ్యను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకురాగా అక్కడ డాక్టర్, సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ఖాళీగదులే కనిపించాయి. అత్యవసర పరిస్థితుల్లో కూడా వైద్య సేవలు అందు బాటులో లేకపోవడంతో కుటుంబం తప్పనిసరిగా 40 కి.మీ దూరంలోని ఏటూరునాగారం ఆసుపత్రికి ప్రైవేట్ వాహనంలో తరలించడం జరిగింది. వైద్యసిబ్బంది లేనితనం, అత్యవసర ఔషధాల కొరత, పర్యవేక్షణ లోపం కారణంగా గ్రామీణ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగలు సమయంలో కూడా ఆసుపత్రిలో స్టాఫ్ కనిపించకపోవడం ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో అనిశ్చితిని పెంచుతోంది. వెంటనే డాక్టర్లు, సిబ్బంది నియామకం చేయాలని, 24 గంటల వైద్య సేవలను పునరుద్ధరించాలని, అత్యవసర మందులను శాశ్వతంగా అందుబాటులో ఉంచాలని గ్రామస్థులు ఆరోగ్య శాఖను కోరుతున్నారు. “భవనం ఉండటం కాదు… సేవలు అందుబాటులో ఉండాలే గానీ ప్రజల ప్రాణాలు కాపాడబడవు” అంటూ ప్రశ్నిస్తున్నారు.






