వెంకటాపురంలో ప్రశాంతంగా ముగిసిన నవోదయ పరీక్షలు
– 112 మంది విద్యార్థులకు 100 మంది హాజరు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రం లోనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో శనివారం నిర్వహించిన జవహర్ నవోదయ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. వెంకటాపురం, వాజేడు, చెర్ల మండలాలకు చెందిన 112 మంది విద్యార్థులు వెంకటాపురం పరీక్షా కేంద్రానికి హాల్ టికెట్లను పొందారు. తెలుగు సబ్జెక్టులో 45 మంది విద్యార్థులు, ఇంగ్లీషు సబ్జెక్ట్ నుండి 67 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు హాల్ టికెట్లు పొందారు. వీరిలో ఒక్కొక్క సబ్జెక్ట్ నుండి ఆరుగురు విద్యార్థుల వంతున రెండు సబ్జెక్టులలో కలిపి 12 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేదు. దీంతో వందమంది విద్యార్థులు వెంకటాపురం పరీక్షా కేంద్రంలో పాల్గొన్నారు. ఉదయం 11:30 గంటల నుండి మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు పరీక్ష సమయం అమల్లో ఉంది. కాగ దూర ప్రాంత విద్యార్థులతో వారి తల్లిదండ్రులు శనివారం ఉదయమే వెంకటాపురం పరీక్షా కేంద్రానికి చేరుకొని వెయిటింగ్ లో ఉన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు వెంకటాపురం పరీక్షా కేంద్రానికి చేరుకోవడంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రోడ్డులో నవోదయ పరీక్షల సందడి నెలకొన్నది. పరీక్షా కేంద్రం వద్ద సిఆర్పిఎఫ్ సివిల్ పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. పరీక్షా కేంద్రాన్ని మండల తాసిల్దార్ ఎం. లక్ష్మీరాజయ్య సందర్శించారు. అలాగే వెంకటాపురం పోలీ స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు కూడా పరీక్షా కేంద్రాన్ని బయట నుండి పర్యవేక్షించారు. పాలేరు నవోదయ పాఠశాల నుండి పరిశీలకులు రాధాకృష్ణ, వెంకటాపురం పరీక్షల నిర్వహణ అధికారి, పాఠశాల ప్రధానోపాధ్యా యులు, మండల విద్యాధికారి కూడ అయిన జీ.వీ.వి. సత్య నారాయణ ఆధ్వర్యంలో పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఐదుగురు ఇన్విజిలేటర్లను నిబంధనల ప్రకారం ఏర్పాటు చేశారు. పరీక్షలు ప్రశాంతంగా జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.