భారత జట్టులో ములుగు ముద్ర
శ్రీలంక క్రికెట్ మ్యాచ్‌లకు ఇద్దరు విద్యార్థుల ఎంపిక
అండర్–14, అండర్–17 విభాగాల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం
విద్యార్థులను సన్మానించిన పాఠశాల యాజమాన్యం
ములుగు, జనవరి 9 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లాకు చెందిన వివేకవర్ధిని హై స్కూల్, బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్‌ల నుంచి ఇద్దరు విద్యార్థులు అండర్–14, అండర్–17 విభాగాల్లో భారత జూనియర్ క్రికెట్ జట్లకు ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. జాతీయ స్థాయి సెలెక్షన్‌లో ప్రతిభ కనబరిచిన ఈ విద్యార్థులు ఈ నెల 14, 17 తేదీల్లో శ్రీలంకలో జరగనున్న జూనియర్ క్రికెట్ మ్యాచ్‌లలో భారత జట్టు నుండి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకొని పాఠశాల డైరెక్టర్లు నరేష్ గౌడ్, సంతోష్ చక్రవర్తిలు ఎంపికైన విద్యార్థులతో పాటు వారికి శిక్షణ అందించిన పీఈటీ మాస్టర్లను ఘనంగా సన్మానించారు. క్రమశిక్షణ, నిరంతర సాధన, అంకితభావంతో ఈ స్థాయికి చేరుకున్న విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో రాణించాలని పాఠశాల యాజమాన్యం ఆకాంక్షించింది. ఈ విజయం పాఠశాలలకు మాత్రమే కాకుండా ములుగు జిల్లాకు కూడా గర్వకారణమని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.







