Mulugu | మహిళతో అక్రమ సంబంధం..?
– కుటుంబ సభ్యుల దాడిలో యువకుడి మృతి
– ములుగు మండలం లాలాయగూడెంలో ఘటన
ములుగు, నవంబర్ 17 (తెలంగాణ జ్యోతి): ములుగు మండలం లాలాయగూడెం గ్రామంలో యువకుడిపై గ్రామస్తులు, ఓ కుటుంబ సభ్యులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఓ యువకుడిని సిమెంటు పోలుకు కట్టేసి తీవ్రంగా చితకబాదడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏటూరు నాగారం మండల కేంద్రానికి చెందిన జాడి సమ్మయ్య బైక్ మెకానిక్‌గా పని చేస్తూ లాలాయగూడెం గ్రామానికి వచ్చేవాడిగా తెలుస్తోంది. గ్రామంలోని ఒక మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానం నేపథ్యంలో ఆదివారం రాత్రి గ్రామానికి వచ్చిన యువకుడిని కుటుంబ సభ్యులు, కొందరు గ్రామస్తులు కలిసి దాడికి పాల్పడ్డారని సమాచారం. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు దాడికి పాల్పడిన వారికి మృతుడు సమ్మయ్య డబ్బులు అప్పుగా ఇచ్చాడని, వసూలు చేసుకునేందుకు వచ్చిన అతనిపై దాడి చేసి కొట్టడంతో చనిపోయినట్లు మరో కథనం ప్రచారంలో ఉంది. అయితే ఈ సంఘటనకు నిజమైన కారణాలు, ఘటనలో ఎవరెవరూ పాల్గొన్నారు అనే అంశాలపై పూర్తి విచారణ చేపట్టిన అనంతరం వివరాలు తెలియనుంది.






