ఏజెన్సీలో నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తు భవనాలు..!
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతో కొందరు గిరిజనేతరులు 1/70చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. బహుళ అంతస్తుల నిర్మాణానికి అనుమతులు లేకపోయినా అక్రమంగా కట్టడాలు కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించ డం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పూర్తిగా మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా కన్నాయి గూడెం మండలంలోని తదితర గ్రామాల్లో బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్నారు.బహుళ అంతస్తుల నిర్మాణం కొనసాగిస్తూ 1/70 చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. మండలం లో బహుళ అంతస్తుల నిర్మాణం కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తు న్నారు. ఇటు పంచాయతీ అధికారులు అటు రెవిన్యూ అధికా రులు ఎవరికి వారే యమునా అన్న చందంగా వ్యవహరించ డంతో బహుళ అంతస్తు కట్టడాలు జోరుగా సాగుతున్నాయి. 1/70 చట్టం ప్రకారం ఏజెన్సీ మండలాల్లో బహుళ అంతస్తుల నిర్మాణం కొనసాగించ రాదని నిబంధన ఉన్నప్పటికీ ఆ నిబంధనలు తుంగలో తొక్కి గిరిజన చట్టాలకు తూట్లు పొడుస్తు న్నారు. చట్టాలను పర్యవేక్షించాల్సిన అధికారులు ముడుపుల మత్తులో మూలుగుతున్నారు. అధికారుల తప్పిదం వల్లనే 1/70 చట్టం అమలుకు నోచుకోవడం లేదని ఆదివాసులు వాపోతున్నారు.