దోమ కాటు – ఆరోగ్యానికి చేటు
– నివారణ చర్యలు చేపడుదాం
– ఆరోగ్యంగా జీవిద్దాం
– మీ ఆరోగ్యం..మీ చేతుల్లోనే…
డెస్క్ : ప్రతి ఏటా ఆగస్టు 20 న ప్రపంచ దోమల దినోత్సవం సందర్బంగా ప్రజా ఆరోగ్య చైతన్యం అవసరం.
డెంగ్యూ వ్యాధి:
డెంగ్యూ వ్యాధి అనేది ఎడిస్ ఈజిప్లై అనే దోమకాటు వల్ల సంభవిస్తుంది. ఈ దోమ వ్యక్తిని కుట్టిన 5 నుండి 10 రోజులలో వ్యాధి కారక డెంగ్యూ వైరస్ వృద్ధి చెందుతుంది. ఆ దోమ కుట్టిన వారికి డెంగ్యూ వ్యాధి సంక్రమిస్తుంది. వ్యాధి బారిన పడిన వారిలో 99 శాతం మంది మామూలు జ్వరం, తలనొప్పి లాంటి లక్షణాలతో బాధపడి త్వరగానే కోలుకుం టారు. కాని ఒక్క శాతం మందిలో మాత్రమే ఈ వ్యాధి తీవ్రంగా వచ్చే అవకాశం ఉంది. డెంగ్యూ కారక దోమలు సాధారణంగా పగటి పూట కుడుతాయి. డెంగ్యూ వ్యాధిని నివారించ వచ్చును. వ్యాధిని పూర్తిగా తగ్గించ వచ్చును. కాని సరి అయిన చికిత్స తీసుకోనట్లయితే ప్రాణాంతకం కావచ్చు.
డెంగ్యూ వ్యాధి లక్షణాలు
* తీవ్రమైన జ్వరం
* తీవ్రమైన తలనొప్పి
* కంటి లోపలి భాగంలో నొప్పి
* వాంతులు మరియు విరేచనాలు
* కండరాలు, కీళ్ళ నొప్పులు
* చర్మంపై దద్దుర్లు (తీవ్రమైన కేసులలో మాత్రమే)
* పంటి చిగుళ్ళ నుండి రక్తస్రావం (తీవ్రమైన కేసులలో మాత్రమే)
దోమకాటు నుండి మనం ఎలా కాపాడుకోవాలి..
పొడవైన చేతులు గల చొక్కాలు ధరించండి. ప్యాంట్ ధరించడం, మస్కిటో రీఫిలెంట్లను వాడటం, దోమ తెరలలో నిద్రించడం.
దోమల పెరుగుదల ఎక్కడ జరుగుతుంది..
ఎడిస్ ఈజిప్టై దోమ నిలువ ఉన్న నీటిలో గుడ్లు పెడుతుంది. ఇండ్ల పరిసరాలలో నిల్వ ఉండే నీరు, వర్షపు నీరు ఎడిస్ ఈజిప్టై దోమల పునరుత్పత్తికి అనువైన ప్రాంతాలు. పాత టైర్లు, వాడని కుండీలు, నీటి తొట్టెలు, సిమెంట్ తొట్టిలు, వాడని చిన్న చిన్న పాత్రలు, కుండలు, పూల కుండీలు, కొబ్బరి బొండాలు, మూతలు లేని నీటి ట్యాంకులు, ఎయిర్ కూలర్లు, సరిగా నిర్వహణ చేయబడని చెత్త లో, చేరిన వర్షపు నీరు, మొదలగునవి.
చికిత్స…
డెంగ్యూ వ్యాధికి చికిత్స లేదు. అతి ముఖ్యమైన విషయం రోగికి జ్వరం, నొప్పుల నుండి ఉపశమనం కల్గించడం. అంతకు మించి ఇతర ఆంటి బయాటిక్స్ ను అతిగా వాడకూడదు. డాక్టర్ సలహా లేనిది మందులు వాడకూడదు. జ్వరం అదుపునకు పారసిటమాల్ ట్యాబ్లెట్ ను వాడాలి.
డెంగ్యూ వ్యాధి నిర్ధారణ…
ప్రస్తుతం జ్వరం వచ్చిన మొదటి రోజునే వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయవచ్చును. డెంగ్యూ డే-1 పరీక్షతో ఇది సాధ్యం.
వైద్యుడ్ని ఎప్పుడు సంప్రదించాలి…
జ్వరం తగ్గిన 3 నుంచి 7 రోజులలో తీవ్రమైన కడుపు నొప్పి, చిగుళ్ళ నుండి రక్తం, నిరంతరం వాంతులు, అలసట, వాంతి లో రక్తం, శ్వాస రేటు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, చికిత్స పొందాలి.
ఫ్రై డే.. డ్రై డే.. అంటే ఏమిటి.
“శుక్రవారం పొడి దినం” అనే నినాదంతో ప్రజలను దోమల నుండి కాపాడడానికి ఉద్దేశించిన ఒక ప్రచార కార్యక్రమం. అవగాహనతో ఆరోగ్యాన్ని కాపాడుకునే ఒక ప్రత్యేక నినాదం. వారంలో ఒక్కరోజు అంటే శుక్రవారం రోజు ఇల్లు, ఇంటి పరిసరాలలో నిల్వ ఉన్న నీటిని తొలగించడం. ఇంటిలో ఉన్న నీటి తొట్టెలు, సిమెంట్ కుండీలు, డ్రమ్ముల లో ఉన్న నీటిని మొత్తం పారబోసి, ఆరనిచ్చిన తరువాత నీరు నింపుకోవాలి. దీని వల్ల జీవిత చక్రం నకు అంతరాయం ఏర్పడుతుంది. లార్వాలు అంతరిస్తాయి. అన్ని రకాల దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది.
దోమ లార్వా లను నిర్మూలిద్దాం!
దోమల ద్వారా వచ్చే వ్యాధుల ను నివారిద్దాం!!
✍️ గాదె రమేష్ నేత
………………………………
944 00 54 323