మహిళా సంఘాల స్టాల్స్ ప్రారంభించిన మంత్రి సీతక్క
ములుగు, జనవరి 10 (తెలంగాణ జ్యోతి): మహిళా సంఘాల స్టాల్స్ ప్రారంభించిన మంత్రి సీతక్క అంటూ ములుగు మండలం పరిధిలోని జంగాలపల్లి క్రాస్, ఇంచెర్ల క్రాస్, ఎర్రిగట్టమ్మ ప్రాంతాల్లో మహిళా సంఘాల చేత ఏర్పాటు చేసిన వివిధ రకాల వ్యాపార స్టాల్స్‌ను రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఇంచర్ల ఎర్రిగట్టమ్మ వద్ద ఏర్పాటు చేసిన టీ స్టాల్, జంగాలపల్లి క్రాస్ వద్ద బొంగు చికెన్, నాటు కోళ్ల అమ్మకం, కూరగాయలు, పండ్లు విక్రయించే స్టాల్స్‌ను మంత్రి ప్రారంభించి జాతర భక్తులకు స్వయంగా టీ విక్రయించారు. జాతరతో పాటు అన్ని ప్రధాన రూట్లలో మహిళా సంఘాల చేత స్టాల్స్ ఏర్పాటు చేసి వారి ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. మహిళలు స్వయం ఉపాధితో బలోపేతం కావాలని, జాతర వంటి పెద్ద అవకాశాలను ఆదాయ వనరులుగా మార్చుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, DRDO శ్రీనివాస్ రావు, అదనపు DRDO గొట్టే శ్రీనివాస్, DPM గడ్డం శ్రీనివాస్, APM శ్రీనివాస్ తదితర అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అలాగే జాకారం, మల్లంపల్లి ప్రాంతాల్లో కూడా ఇలాంటి స్టాల్స్‌ను మంత్రి ప్రారంభించారు.







