నార్లాపూర్ నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభించిన మంత్రి సీతక్క
తాడ్వాయి, డిసెంబర్31,తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం పరిధిలో నూతనంగా నిర్మించిన నార్లాపూర్ పోలీస్ స్టేషన్‌ను రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు. మేడారం మహాజాతర నిర్వహణలో భాగంగా శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. మహాజాతర సమయంలో లక్షలాది మంది భక్తులు మేడారానికి తరలివచ్చే నేపథ్యంలో, వారి భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, చట్టసువ్యవస్థ పరిరక్షణలో నార్లాపూర్ పోలీస్ స్టేషన్ కీలకంగా పనిచేస్తుందని ఆమె పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు తక్షణ పోలీస్ సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్, జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకరతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నార్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా ఏ. కమలాకర్ విధులు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.





