డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్యను సన్మానించిన మంత్రి సీతక్క
– వాగులు దాటి వైద్యం అందించడంపట్ల బృందానికి అభినందనలు
ములుగు ప్రతినిధి తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలుకు వాగులు, వంకలు దాటుతూ రెండుసార్లు గిరిజన ప్రజలకు వైద్యం అందించినందుకు గాను రాష్ర్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క వైద్య బృందాన్ని సన్మానించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య తోపాటు వాజేడు వైద్యులు డాక్టర్ మహేందర్, డాక్టర్ మధుకర్, సిబ్బంది చిన్న వెంకటేష్, రజిని, ప్రసాద్, రమేష్ లను శాలువాలతో సత్కరించారు. అటవీ ప్రాంతంలో బాధ్యతగా వ్యవహరించి గిరిజనులకు సేవలు చేయడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. వైద్యులు దేవునితో సామానమని, కష్టపడి పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. అదేవిధంగా జిల్లాలోని మారుమూల ప్రాంతాలైన ఐలాపూర్, కన్నాయిగూడెం మండలం, తాడ్వాయి మండలంలోని పోచాపూర్, బుల్లెపల్లి నర్సాపూర్, అల్లిగూడెం, బంధాల, నూగురు వెంకటాపురం లోని సీతారాంపూర్, ముత్తారం కలిపాక, జిల్లాలోని సుమారు 61గొత్తికోయ గుడాలలో నివసిస్తున్న ప్రజలకు సేవలందిం చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మంత్రి రవి, అన్నవరం రవికాంత్, తదితరులు పాల్గొన్నారు..
– మంత్రికి చేతితో గీసిన చిత్రపటం బహుకరణ
ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఆశ్రమ ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ టీచర్ గా పనిచేస్తున్న కొత్త రవీందర్ తన చేతులమీదుగా వేసిన ఆమె చిత్రపటాన్ని మంత్రి సీతక్కకు అందజేశారు. ఆదివాసీ ఆడబిడ్డగా ప్రజలకు చేస్తున్న సేవలకు గుర్తుగా తాను స్వయంగా గీసిన చిత్రాన్ని అందించినట్లు రవీందర్ పేర్కొన్నారు. రవీందర్ కళకు మంత్రి అభినందనలు తెలిపారు.